కుప్పం: రాష్ట్రాన్ని పాలించే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కుప్పం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు.

”విశాఖ ఏజెన్సీలో 25వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారు. రూ.8వేల కోట్ల విలువైన గంజాయి సరఫరా చేస్తున్నారు. చర్యలు తీసుకోమని కోరితే తెదేపా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. దిల్లీలో రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం ఉందని రాష్ట్రపతికి తెలిపా. తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడులు చేయిస్తున్నారు. నాపై బాంబులు వేస్తామని అంటున్నారు. బాంబులకు భయపడే వ్యక్తిని కాదు. అక్రమ కేసులకు భయపడి పార్టీ మూసేయాలా? పేదల కోసం దర్మపోరాటం చేస్తున్న నన్ను ప్రజలే కాపాడుకుంటారు. రాష్ట్రంలో వింత వింత మద్యం బ్రాండ్లు తెచ్చారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా మద్యం షాపులు తెరిచారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్తరకం మద్యం బ్రాండ్లు తెచ్చి.. రేట్లు విపరీతంగా పెంచేశారు” అని చంద్రబాబు విమర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.