పర్యాటకం పేరుతో ప్రైవేటువారికి భూములను కట్టబెట్టడాన్ని సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రైవేటు సంస్థలు విశాఖలో ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించేందుకు కోట్ల రూపాయల విలువైన భూములను పెద్ద మొత్తంలో కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి గురువారం ఆమోదం తెలపడాన్ని ఆయన ఖండించారు. ప్రయివేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులను చేయవని ఆయన పేర్కొన్నారు. భీమిలి మండలం అన్నవరం గ్రామంలో 40 ఎకరాలను ఒబెరారు సంస్థకు కేటాయించారని, తాజ్‌ బ్రాండ్‌తో విశాఖలో 260 గదులతో అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మించి 1270 చదరపు అడుగుల్లో 90 సర్వీసు అపార్టుమెంట్లును అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారని తెలిపారు. 2500 మంది కూర్చునేందుకు వీలుగా తాజ్‌ బ్రాండ్‌తో రూ.722 కోట్లతో ఐటి సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారని పేర్కొన్నారు. కైలాసగిరి కొండపై భారీ స్కై టవర్‌ను, మధురవాడ శిల్పారామం జాతరలో ప్రయివేటు హయత్‌ సంస్థ ఆధ్వర్యాన ఓ స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ను పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక్కడ అందుబాటులో 25 ఎకరాల స్థలం ఉన్నా పిపిపి విధానం కావడంతో ప్రస్తుతమున్న శిల్పారామాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొందని పేర్కొన్నారు. టూరిజం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలన్నీ ప్రయివేటుకు లాభం చేకూర్చేవేనని తెలిపారు. గతంలో గంగవరం పోర్టును పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేసి తదనంతరం అదానీ సంస్థకు ఎలా కట్టబెట్టారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.