అమరావతి: బీసీల కోసం పెట్టే సభకు కూడా సరైన పేరే దొరకలేదా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జయహో బీసీ నినాదం తెలుగు దేశం పార్టీ సొంతం అని చెప్పారు. రాష్ట్ర బీసీ నేతలంతా జగన్ పాలనలో ఇదేం ఖార్మరా బోబోయ్ అంటూ బోరుమంటున్నారని చెప్పుకొచ్చారు. బీసీ మంత్రులు పదవుల కోసం బీసీల భవిష్యత్‌ను జగన్(Cm jagan) కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అమలైన బీసీ పథకాలు నిలిపేసినా జగన్‌రెడ్డిని నిలదీయని అసమర్థలుగా మంత్రులు మిగిలిపోయారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని అడిగారు. 8 వేల ఎకరాల బీసీ అసైన్డ్ ల్యాండ్స్‌ను లాక్కున్నందుకు బీసీ సభలు పెడుతున్నారా? లేదంటే రూ.34 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించినందుకా? 650 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 2 వేల మందిపై దాడులు చేసినందుకు బీసీ సభ పెడుతున్నారా? అంటూ కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.