కర్నూలు: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటే లక్ష్యంగా చేపట్టిన రాయలసీమ గర్జన విజయవంతమైంది. ఈ గర్జనకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ సోమవారం నిర్వహించారు. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు రాయలసీమ గర్జన సభలో పాల్గొని వారి ప్రసంగాలతో స్ఫూర్తి నింపారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు గళం విప్పారు. శ్రీబాగ్ ఒప్పంద ప్రాకరం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాయలసీమ గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హాఫీజ్‌ఖాన్, శిల్పా చక్రపాణిరెడ్డి, తొగూరు ఆర్థర్, ఎమ్మెల్సీ ఇక్బాల్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు.
మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర: మంత్రి గుమ్మనూరు జయరాం
కర్నూలు: మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు. కర్నూలు గర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతివ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని… సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతును ఇవ్వాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలన్నారు.