రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహ నిర్మాణాల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని, వన్‌టైం సెటిల్మెంట్ (ఒటిఎస్) విధానంపై లబ్ధిదారుల్లో విరివిగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల్లో ఒటిఎస్ విధానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలపై వివరించాలన్నారు. గృహ నిర్మాణాలు, ఇతర సాంకేతిక ప్రక్రియల పురోగతిపై మంగళవారం జిల్లాలోని ఎంపిడిఒలు, తహశీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారుల వివరాలను సేకరించాలని, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. స్థానిక పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, గహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో జెసి (హౌసింగ్) కల్పనా కుమారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, జివిఎంసి కమిషనర్ లక్ష్మీశ, జోనల్ కమిషనర్లు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.