కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై ఆమె ఏకంగా 90, 533 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రెస్మీట్ ఏర్పాటుచేశారు. బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ ప్రజలు కేవలం భాజపానే కాదు.. తెదేపా, జనసేనలను కూడా ఓడించారన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన.. బరిలో నిలవనప్పటికీ బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఎంపీ ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు తెర వెనుక ఉంటూ బీజేపీకి 20వేల ఒట్లు వేయించారని నందిగం సురేశ్ తెలిపారు. ఇక ఉప ఎన్నికలకు వెళ్లనంటూనే భాజపాకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు.