జాతీయ గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం (ఎన్ఆర్ డిడబ్ల్యుపి) పథకం క్రింద జిల్లాలోని ప్రతి ఇంటికీ మార్చి, 2024 నాటికి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జలజీవన్ మిషన్పై నిర్వహించిన జిల్లా నీటి, పారిశుధ్యం మిషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం పరిశుభ్రమైన నీటిపైనే ఆధారపడి వుంటుందన్నారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల జీవన్ మిషన్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు కూడా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయడమే పథకం ఉద్దేశ్యమన్నారు. ప్రజలే నీటి పథకాలను నిర్వహించు కుంటారన్నారు. ఈ విషయంలో ప్రజలలో అవగాహన కల్పిస్తూ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వివిధ శాఖల సమన్వయంతో పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం జిల్లాలో రూ.433.33 కోట్లతో 3377 పనులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల ప్రజలు నీటి స్కీముల నిర్వహణ బాధ్యతలను చేపట్టేట్లుగా ఎన్జివోలు వారికి అవగాహన కల్పించాలన్నారు. విలేజ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి, జిల్లా మిషన్ కు ఆమోదానికి పంపాలన్నారు.