1960వ దశకం నుంచి ఆంధ్రవిశ్వవిద్యాలయం వామపక్ష, కార్మికోద్యమ భావజాలానికి కేంద్రంగా విలసిల్లింది. ఎయు అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అందరిలోనూ వామపక్ష అనుకూల భావజాలం ప్రస్ఫుటంగా కనిపించడం పరిపాటిగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, యాజమాన్యాల కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై సిపిఎం భావజాలంతో ప్రేరేపితులైన వారు నిరంతరం పోరాడుతుండేవారు. రాష్ట్రంలో అభ్యుదయ భావాలకు కేంద్రంగా ఆంధ్రా యూనివర్శిటీలో ఉండేది. కమ్యూనిస్టు అభిమానులు నిర్వహించే కార్యక్రమాల ప్రభావంతో ఏయూలో కార్మికోద్యమం కూడా ప్రారంభమై బలపడింది.
సమైక్యాంధ్ర నినాదాలు …
1970వ దశకంలో సమైక్యాంధ్ర నినాదాలతో సిపిఎం భావజాలం గల వ్యక్తులు ఏయూలో నినదించారు. ఒక వైపు జై ఆంధ్రా ఉద్యమం జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా ఉండాలన్న విధానాన్ని సిపిఎం భావాలతో ప్రేరేపితులైన చింతపల్లి నరసింగరావు, సోల్మన్రాజు వంటి వారు తీసుకున్నారు. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. సమైక్యాంధ్ర అంటే పెట్రోల్ పోసి తగలబెడతామంటూ యూనివర్శిటీలో కొంతమంది విభజన వాదులు చింతపల్లి నరసింగరావును తీవ్రంగా హెచ్చరించినా సమైక్య నినాదం వదల్లేదు.
