ఎపి టూరిజం కార్పొరేషన్‌లో పని చేస్తున్న గిరిజన ప్రాంత కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కోత విధించిన జీతాలను తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి టూరిజం మయూరి సెంటర్‌ వద్ద మధ్యాహ్న భోజన సమయంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి టూరిజం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.గంగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఎపి టూరిజంలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో సమ్మె చేసినప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తామని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని, అవుట్‌ సోర్సింగ్‌, డైలీవేజ్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. టూరిజం శాఖలో గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని యూనిట్లూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నా గిరిజన కార్మికులకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి యూనిట్లును నడిపిన కొంతమంది ఉద్యోగులకు జీతాల్లో కోత విధించడం దారుణమన్నారు. టూరిజం యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పి.బాలదేవ్‌, ఎపి టూరిజం వర్కర్స్‌ యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శి బాబూరావు, ఉపాధ్యక్షులు జాన్‌, సహాయ కార్యదర్శి అంజలిరావు, ధర్మ, సురేష్‌, సంజీవరావు, మహేష్‌ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.