హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి ఆపరేషన్, ప్రొటోకాల్ అంశాలపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగిన కృష్ణా బోర్డు సబ్ కమిటీ దీనిపై ప్రాథమిక దశలోనే చేతులెత్తేసింది. కేంద్ర జల సంఘం ఇంజనీర్లతో కలిసి తయారు చేసిన ముసాయిదా నివేదికపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలోనే ఈ అంశాన్ని తేల్చుదామంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖల ద్వారా సమాచారమిచ్చింది. కృష్ణా స్పెషల్ బోర్డు భేటీలో చేసిన నిర్ణ యం మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వం లో సబ్ కమిటీ ఏర్పాటయ్యింది.