Four children die as fire breaks: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన నుంచి 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటడినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి విశ్వాస్ సారంగ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.