ఏజెన్సీలో ‘ఆపరేషన్ పరివర్తన్’లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో గంజాయి పంట నిర్మూలన చర్యలు చేపడుతున్నాయి. ఒకవైపు గిరిజనులకు అవగాహన కల్పిస్తూ, మరోవైపు పంటలను ధ్వంసం చేస్తున్నారు. స్వచ్ఛందంగా పాల్గొన్న గిరిజనులను సత్కరించి ప్రోత్సహిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 200 ఎకరాల్లో గంజాయిని గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కుంకుమపూడిలో ఐదెకరాల్లోని గంజాయి పంటను గిరిజనులతో స్వచ్ఛందంగా ధ్వంసం చేయించారు. చింతపల్లి, పాడేరు సబ్ డివిజన్ పరిధిలో మండలాల వారీగా పోలీసులు కార్యచరణతో కదులుతున్నారు. జికె వీధి మండలం గూడెం పంచాయతీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కుంకుమపూడి గిరిజనులకు గంజాయిసాగు వల్ల కల్గే దుష్పరిణామాలు, చట్టపరమైన సమస్యలపై సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ సమీర్ అవగాహన కల్పించారు. ఇక్కడ గిరిజనులు ఐదెకరాల గంజాయి పంటను నాశనం చేశారు. చింతపల్లి మండల, గొండుపాకులు పంచాయతి గడిగోయాలో 20 ఎకరాలు గంజాయి తోటను ఎస్ఐ అలీ షరీఫ్, పోలీసు సహాయంతో గిరిజనులు ధ్వంసం చేశారు. గొందుపాకలు, పెదబరడా, లమ్మసింగి మహిళా పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పాడేరు మండలం గొందలి, కించూరు పంచాయతీలోని చీడిమెట్ట ఐదు, బొంజంగిలో మూడు, తొట్లగొంది ఎనిమిది ఎకరాల్లోని పంటను ఎస్ఐలు జి.లక్ష్మణరావు, టి.రవికుమార్ ఆధ్వర్యంలో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి పంటను ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కండ్రం పంచాయతీ కండ్రం, బెడ్డగూడలో 12 ఎకరాల గంజాయి పంటను ఎస్ఐ నజీర్ ఆధ్వర్యంలో గిరిజనులు నాశనం చేశారు. జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయితీ సుబ్బులుకు చెందిన దేవన్నదొరను పాడేరు ఎసిపి పి.జగదీష్ తన కార్యాలయంలో సత్కరించారు. ఇదే స్ఫూర్తితో గంజాయి సాగులో ఉన్న గ్రామాల గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి పంటను ధ్వంసం చేయాలని ఆయన కోరారు.