సిపిఎం గ్రేటర్ విశాఖ నగర 11వ మహాసభ ఈ నెల 13, 14 తేదీల్లో స్టీల్‌ప్లాంట్ జోన్ పరిధి నడుపూరు ఉక్కు కళావేదికలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు తెలిపారు. మంగళవారం సిపిఎం నగర కార్యాలయంలో మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఉక్కు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి, ప్రజల మౌలిక వసతుల సమస్యలపై భారీ బహిరంగ సభ నడుపూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖ్య వక్తగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు, ఎంవిఎస్.శర్మ వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. 13న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.