ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. విశాఖ నగరంలోని పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను ధనరాజ్ (22), కె.వినోద్ ఖన్నా (22) గా గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మారికవలస ప్రాంతానికి చెందిన ధనరాజ్, కె.వినోద్ ఖన్నా కలిసి పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యారు.
ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్‌కు చేరుకొని.. మళ్లీ అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో స్టేడియం సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్, వినోద్ ఖన్నా అక్కడికక్కడే మృతిచెందారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో, వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన ఇద్దరు యువకులు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. దీంతో మారికవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.