విశాఖ జిల్లాలో ఉన్న మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను విఎంఆర్డిఎ పరిధి నుంచి మినహాయించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యాన రోలుగుంట మండలం అర్ల గ్రామంలో బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో మైదాన ప్రాంత గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఆయా గ్రామాలను విఎంఆర్డిలో కలపడం వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలని, సాగు చేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. తాగు నీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతురాజు, నూకరాజు, రామారావు పాల్గొన్నారు.