బుచ్చయ్యపేటలో జిల్లాలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సూచించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలలో ఐదు కిలోమీటర్ల పరిధిలో టైరు బళ్ల ద్వారా ఇసుక ఉచిత రవాణా చేసుకోవచ్చన్నారు. గతంలో ఇళ్ల రుణాలు పొందిన వారు వన్‌టైమ్ సెటిల్మెంటుతో కేవలం రూ.10వేలు చెల్లించి జగనన్న గృహహక్కు పథకం ద్వారా పూర్తిహక్కు పొందవచ్చన్నారు. దీనిపై గ్రామాలలో ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. సొంతంగా ఇల్లు నిర్మించుకోలేనివారికి న్యాయచిక్కులు తొలిగాక నియోజకవర్గంలో ప్రైవేటు ఏజెన్సీద్వారా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అనంతరం వివిధశాఖలపై సమీక్ష జరిపారు. మండల సమావేశానికి ఎక్కువమంది అనధికార సభ్యులు హాజరుకావడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలిత, కోఆప్షన్ సభ్యుడు కె.అచ్చెన్నాయుడు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహశీల్దార్ మహేశ్వరరావు హాజరయ్యారు.