స్టీల్‌ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన నేల విశాఖలోని పెదగంట్యాడ, నడుపూరులో ఈ నెల 13, 14 తేదీల్లో సిపిఎం నగర 11వ మహాసభ సందర్భంగా శ్రామిక జన సాంస్కృతిక ఉత్సవాలకు తెరలేచింది. కళా ప్రదర్శనల ప్రారంభ సూచికగా పెదగంట్యాడలో బుధవారం సాయంత్రం కళాకారులు ‘డప్పులమోత’ మోగించారు. పోరాటాల శంఖం పూరించేందుకు సిపిఎం మహాసభ ఉక్కు నిర్వాసిత కాలనీలో రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ప్రజా ఉద్యమాలకు కళారూపాలు తోడైతే ప్రభవించే విప్లవ నాదం… అందులోంచి ఉద్భవించే ఉత్తేజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ కమ్యూనిస్టు పార్టీ మహాసభల సందర్భంగా ఆటా-పాటా అంటే చిన్నా, పెద్దా, ముసలీ, ముడగ అందరిలోనూ రోమాలు లేచినిలబడే చైతన్యం నింపేలా ఉంటాయన్నది చారిత్రక సత్యం.