డ్రగ్స్‌ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్‌ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్‌లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన చరిత్ర చంద్రబాబు కుటుంబానిది అని.. దీనిపై దర్యాప్తు సంస్థలు అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు.. తమ వ్యవహారం బయటకి రాకుండా ఉండేందుకే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ప్రపంచంలో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి.. వైసీపీకి లింక్ పెడుతూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని.. హెరాయిన్ విషయంలో రాష్ట్రానికేం సంబంధం లేకున్నా.. అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఇదే సందర్భంలో అదానీ మీద పడ్డారంటూ ఫైర్ అయ్యారు.

రాజమౌళి, బోయపాటిలు వీళ్లతో ఉన్నారో.. లేక తెలుగుదేశం వాళ్లే డైరెక్టర్లుగా మారారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించిన సజ్జల. అనవసరంగా ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి, ద్వారంపూడి పేర్లను ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తున్నా.. జనం నమ్మడం లేదు.. అయినా, ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని.. అలీషా అనే వ్యక్తికి చంద్రబాబు.. ఘంటా శ్రీనివాస్ తోనే పరిచయం ఉందన్నారు.. వెతికితే చాలా పట్టుకోగలం.. వికీలీక్స్.. పారాడైజ్ పేపర్స్.. పనామా పేపర్స్.. ఇప్పుడు పండోరా పేపర్స్ అంటూ విమర్శలు చేసిన ఆయన.. పనామా పేపర్సులో హెరిటేజ్ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావన ఉందని కామెంట్ చేశారు.. తెల్గీ స్కామ్, హసన్ అలీ కుంభకోణం, కోలా కృష్ణమోహన్ ఇదీ టీడీపీ చరిత్ర అంటూ ఎద్దేవా చేసిన వైసీపీ నేత. చంద్రబాబు స్వభావమే బూటకం.. జగన్‌పై వేసినవి తప్పుడు కేసులేనని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారంలోకి వచ్చాం అన్నారు. హెరాయిన్ విషయంలో ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై న్యాయస్థానాలకు వెళ్తామని హెచ్చరించిన సజ్జల.. చంద్రబాబును ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయన్నారు. ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటుగా పని చేయగల సిద్దహస్తుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.