సింహాద్రి అప్పన్న దేవస్థానానికి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సుమారు 32 గ్రామాల్లో భూములున్నాయి. వీటిలో 27 గ్రామాల్లో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకపోయినా ఐదు గ్రామాల్లో మాత్రం దశాబ్దాల తరబడి వివాదం రగుల్కొంటూ వస్తోంది. అడవివరం, చీమలాపల్లి, పురుషోత్తమపురం, వేపగుంట, వెంకటాపురం తదితర పంచ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యతో ఇక్కడి ప్రజలు ఇక్కట్లకు గురౌతున్నారు. వీరు వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే జీవనం సాగిస్తున్నారు. 1996-1997లో చంద్రబాబు ప్రభుత్వం ఈ పంచ గ్రామాలకు చెందిన 9069.22 ఎకరాల భూమికి రైత్వారీ పట్టాలను సింహాచలం దేవస్థానానికి ఏకపక్షంగా ఇప్పించి, అక్కడ నివాసముంటున్న ప్రజలందరినీ ఆక్రమణదారులుగా పేర్కొంటూ క్రమబద్ధీకరణకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు కట్టాలని 2000 సంవత్సరంలో జీవో 578ను జారీ చేసింది. దీంతో సమస్య ఉత్పన్నమైంది. తమ సొంత స్థలాలకు తాము తిరిగి డబ్బులు కట్టడమేమిటని ప్రజలు అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం ఆ స్థలాల్లోని ఇళ్లపై క్రయవిక్రయాలు నిలిపివేసింది. చివరికి ఇళ్ల రిపేర్లకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ పంచ గ్రామాల భూ సమస్యపై సిపిఎం, ప్రజా, రైతు సంక్షేమ సంఘం రైతులు, ప్రజల తరుపున పోరాడుతూ వస్తున్నాయి.