మండలంలోని జర్రకొండ పంచాయతీ సీసాయి పనుకు గిరిజన వాసులు శ్రమదానంతో తమ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారంతా పలు మార్లు మండల అధికారులకు, ఐటిడిఎ పిఒకు, ఎమ్మెల్యేకు సమస్యను విన్నవించినా వారెవ్వరూ స్పందించి తారు రోడ్డు మంజూరు చేయలేదు. ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పాడవడంతో ఇంటింటా కొంత సొమ్ము చందాలేసుకుని తాము కూడా స్వచ్ఛంద కూలీలుగా మారి రోడ్డు వేసుకుంటున్నారు. పంచాయతీ పరిధిలోని 11 గ్రామాల్లో ఉన్న 2 వేల మంది రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. పలువురు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక మృత్యువాత పడిన ఘటనలను ఉదహరించారు. గర్భిణులు పడుతున్న ఇబ్బందులను తెలియజెప్పారు. గత కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వాలు తారు రోడ్డు మంజూరు చేస్తామని మోసగించాయని, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. శ్రమదాన కార్యక్రమంలో వార్డు మెంబర్‌ పాంగి మేరీ, పాంగి మల్లన్న, వాలంటీర్‌ వంతల జగ్గారావు, కొర్ర మోహన్‌రావు, వి.అప్పారావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జర్రకొండ పంచాయితీకి తక్షణమే తారు రోడ్డు మంజూరు చేయాలని సిపిఎం వైస్‌ ఎంపిపి సుడిపల్లి కొండలరావు డిమాండ్‌ చేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.