ఆంధ్ర విశ్వవిద్యాలయంతో భారతీయ విద్యా కేంద్రం (బివికె) అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఏయూ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, బివికె కార్యదర్శి రెడ్డి నాయుడులు సంతకాలు చేశారు. అనతరం ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, యోగ విద్యను అందిరికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ యోగా కేంద్రం పర్యవేక్షణలో విభిన్న యోగా కేంద్రాలతో ప్రజలకు యోగ విద్యను చేరువ చేసే దిశగా పని చేస్తున్నామన్నారు. బివికె సంస్థలు ముందుకు వచ్చి యోగా డిప్లమో కోర్సు నిర్వహణకు ఎంఓయూ చేసుకోవడం ఆనందదా యక మన్నారు. అవగాహన ఒప్పందంలో భాగంగా బివికె సంస్థ ఆరు నెలల డిప్లమో ఇన్యోగా కోర్సును నిర్వహించడానికి ఏయూ అనుమతి మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో బివికె చైర్మన్ ఆచార్య అవధాని, బివికె కరస్పాండెంట్ డాక్టర్ పి.త్రినాధ రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిష్ణమోహన్, ఏయూ యోగా కేంద్రం గౌరవ సంచాలకులు ఆచార్య భానుకుమార్, విభాగాధిపతి ఆచార్య కె.రమేష్ బాబు, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.