రైతులు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాలలోనే అమ్మాలని దళారులను నమ్మి మోసపోకూడదని జిల్లా జాయింట్ కలెక్టరు యం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న, సన్నకార రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించుటకు ఖరీఫ్ నిర్థిష్ట నాణ్యతా ప్రమాణాలు కలిగిన, సాధారణ రకం క్వింటాలకు రూ.1940, గ్రేడ్ ఎ (మేలు రకం) క్వింటాలకు రూ.1960 ప్రకటించడం జరిగిందన్నారు. అదే విధంగా పత్తి రైతు పండించిన పంటను ఈ-క్రాప్ లో నమోదు చేసుకోవాలన్నారు. దీంతో దళారి వ్యవస్థను అరికట్టవచ్చన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం కాపీలను రైతు భరోసా కేంద్రంలో ఇకెవైసి చేయించుకోవాలని తెలిపారు. రైతు తమ ధాన్యాన్ని విక్రయించడానికి సిద్థపడితే వారి పంట వివరాలను రైతు భరోసా కేంద్రం లో తెలియజేసిన ఎడల టెక్నికల్ సిబ్బంది ధ్యానం నాణ్యతను పరిశీలించుటకు రైతులకు కూపన్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ బోర్డు చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ లీలావతి, డిఎం. సివిల్ సప్లయిస్ రాజేశ్వరి ఇతర వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.