ఆదివారం పర్యాటక కేంద్రమైన అరకులోయకు పర్యాటకులు భారీగా తరలి రావడంతో సందర్శిత ప్రాంతాలన్నీ కళకళలాడాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో వేలాది మంది కుటుంబాలతో సహా తరలివచ్చారు. వీరి రాకతో గిరిజన సాంస్కృతిక మ్యూజియం, పద్మావతి ఉద్యానవన కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికంగా వ్యాపారాలు జోరందుకున్నాయి.
డుంబ్రిగుడ : మండలంలోని పర్యాటక కేంద్రాలైన అంజోడ సిల్క్ ఫారానికి ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆటపాటలతో సందడిగా గడిపారు. నృత్యాలు చేశారు. చాపరాయి జలపాతం, కొల్లాపుట్టు జల తరంగిణి వద్ద కూడా పర్యాటక తాకిడి కనిపించింది. జలపాతంలో సరదాగా జారుకుంటూ స్నానాలు చేస్తూ జోష్ ఫుల్గా అందరూ కనిపించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వలిసె పూల తోటల్లో ఫొటోలు తీసుకుంటూ పరవశించిపోయారు.
