ఆశా వర్కర్ల సమస్యలపై ఈ నెల 23న చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, వి.సత్యవతి పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించరాదని, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, అధికారుల, ప్రజాప్రతినిధుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి మూడు లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు పెన్షన్ సదుపాయం వర్తింపజేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకరరావు, వి.మేరీ, పద్మ, చిట్టెమ్మ, మంగ లక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు.