జివిఎంసి 31వ వార్డుకు సోమవారం జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా వైసిపి, జనసేన పార్టీ కార్యకర్తలు పలు చోట్ల ఘర్షణలకు దిగారు. డాబాగార్డెన్స్‌లోని మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతుల వద్దకు రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వైసిపి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు తదితరులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రావడంతో జనసేన కార్యకర్తలు వారి ప్రశ్నించారు. దీంతో వైసిపి, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తరువాత ఘర్షణ చోటుచేసుకుంది. ఒక దశలో వైసిపి ముఖ్య నాయకుడు జనసేన కార్యకర్తలపై భౌతిక దాడికి దిగ్గా, జనసేన కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని సముదాయించి దూరంగా పంపించారు. కొద్ది సమయానికి అక్కడికి చేరుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్‌, బొలిశెట్టి సత్యనారాయణ తమ పార్టీ మహిళలపై వైసిపి మహిళలు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ప్రేమ సమాజం పోలింగ్‌ బూత్‌లోకి జనసేన నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్‌ వెళ్ళటాన్ని వైసిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వివాదం జరిగింది. ఇన్‌ కమ్‌ టాక్స్‌ కార్యాలయంలోని పోలింగ్‌ బూత్‌ వద్ద కూడా జనసేన, వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published.