ఒకవైపు పెరిగిన ధరలు.. ఇంకోవైపు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు.. ఎరువులు సరఫరా చేసి రైతుల ఇబ్బందులను తీర్చాలని అనేక వినతులు… ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ అగ్రహానికి, అసంతృప్తికి రైతు సంఘం పోరాట రూపమిచ్చింది. 1975లో అచ్యుతాపురం, అనకాపల్లి ఎరువుల గొడౌన్లపై దాడికి పిలుపునిచ్చింది. అప్పటి సిపిఎం జిల్లా కార్యదర్శి దొడ్డి రామునాయుడు గ్రామ గ్రామాన సమావేశాలు పెట్టారు. ఎరువులు దొరక్క అల్లాడుతున్న రైతాంగం రైతు సంఘం పిలుపు మేరకు ఎరువుల గొడౌన్లపై దాడికి తరలివచ్చేలా రామునాయుడు రైతులను కదిలించారు. తొలుత అచ్యుతాపురం గొడౌన్‌పై దాడి చేసి ఎరువులు పంపిణీ చేసిన వార్త దావానంలా వ్యాపించింది. సిపిఎం, రైతు సంఘం గొడౌన్లపై దాడి చేసి ఎరువులు అందిస్తుందన్న సమాచారం రైతుల చెవుల్లో పడింది. తరువాత అనకాపల్లి ఎరువుల గొడౌన్‌పై జరిగిన దాడిలో వేలాది మంది రైతులొచ్చారు. గొడౌన్లపై జరిగిన దాడిని పోలీసులు భగం చేయాలనుకున్నారు. రైతు సంఘం, సిపిఎం నాయకులు ప్రతిఘటించి రైతులందరకీ ఎరువులు అందేవరకు నిలబడ్డారు. కౌంటర్‌లో కూర్చొని ఒక్కో రైతుకు ఒక్కో ఎరువుల బస్తా అందించారు. ఎరువుల బస్తాలకు ధర ప్రకారం డబ్బులు చెల్లించారు. ఎరువు దొరికిన రైతులంతా సంబరపడ్డారు. గొడౌన్లపై చేసిన దాడిని కథకథలుగా చెప్పుకున్నారు. సమూహంగా వచ్చిన పోలీసులు అప్పట్లో ఏమీ చేయలేక తరువాత గొడౌన్లపై దాడికి నాయకత్వం వహించిన దొడ్డి రామునాయుడు, సహా పెంటకోట జగన్నాధం, హరిపాలేనికి చెందిన మాణిక్యం తదితరులను అరెస్టు చేసి కేసులు పెట్టారు. నేటి సిపిఎం నాయకులు బుద్ద రంగారావు ఈ దాడిలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.