న్యూఢిల్లీ: మూలధన వ్యయం పెంచాలని పలు రాష్ట్రాలు కోరిన మేరకు ఒక ముందస్తు వాయిదాతో కలుపుకుని మొత్తం రూ.95,082 కోట్లను ఈ నెలలో రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం చేసేందుకు సోమవారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సీఎంలు, మూడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఇందులో మూలధన వ్యయాన్ని పెంచాలని రాష్ట్రాలు కోరాయి.