ఆరోపణలు… ప్రత్యారోపణలతో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల రాజకీయం మరింతగా వేడెక్కింది. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్ ఉల్లంఘిస్తోందంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని, ఏజెంట్ల ద్వారా కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక కుటుంబంలా ఉన్న ‘మా’ అసోసియేషన్‌ని ప్రకాశ్‌రాజ్ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంచు విష్ణు ప్రత్యారోపణలు చేశారు. మేం న్యాయబద్ధంగానే ఎన్నికల్లో తలపడుతున్నామని, ప్రకాశ్‌రాజ్ పరిశ్రమలోని పెద్దలకి మర్యాద ఇచ్చి మాట్లాడాలని హితవు పలికారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. అనంతరం మంచు విష్ణు విలేకర్ల సమావేశం నిర్వహించారు.