కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే బాలికలకు నాణ్యమైన బ్రాండెడ్‌ నాప్కిన్లు నెలకు 10 చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. స్వేచ్ఛ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జనన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. విశాఖ నగరంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి మంత్రితో పాటు జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.మల్లికార్జున, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ఆడపిల్లల నెలసరి రుతుక్రమ సమయంలో పడే ఇబ్బందుల వల్ల డ్రాపౌట్స్‌ ఉంటున్నాయని, వీటిని నివారించి వారి ఆరోగ్య భద్రత పెంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కలెక్టరు మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఒక ‘స్వేచ్చ’ నోడల్‌ అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ ‘స్వేచ్చ’ ఆడపిల్లలందరికీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌, ఎంపీ విద్యార్థినులతో కలిసి మధ్యాహ్నం భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో విఎమ్‌ఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర నగరల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పిళ్ళా సుజాత, జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్‌.చంద్రకళ, డిప్యూటీ డిఇఒ ప్రేమ కుమార్‌, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ బుడుమూరు మీనా, హెచ్‌ఎమ్‌ ఎ.జయప్రద తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.