ఏజెన్సీలో గ్రామస్థాయిలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ కార్యకర్తలుగా గుర్తించి వేతనాలు అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన పెదబయలు, గోమంగి, రూడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పెదబయలులో సిఐటియు జిల్లా నాయకులు బి.సన్నిబాబు మాట్లాడుతూ సిహెచ్డబ్ల్యులు 20 నుంచి 25 ఏళ్లగా గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇవే విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు వేతనం ఇస్తుండగా, సిహెచ్డబ్ల్యులకు కేవలం రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పృద్వీరాజ్, నాయకులు కె.శరబన్న, సిహెచ్డబ్ల్యుల నాయకులు లకే లక్ష్మి, వి.సుబ్బలమ్మ, పద్మ పాల్గొన్నారు.