ఆయుధాలతో ఏటీఎంలు లూఠీ చేసిన వాళ్లను చూశాం. ఏటీఎంకు వచ్చే వాళ్ల దృష్టి మళ్లించి డబ్బులు కాజేసిన వాళ్ల గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో వెరైటీగా ఏటీఎంలో డబ్బు మాయం చేసే గ్యాంగ్‌ని చార్మినార్ పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం ట్యాపింగ్ టెక్నిక్‌తో బ్యాంకు అధికారులకు కూడా డౌట్ రాకుండా లక్షలు కాజేశారు. SBI ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకొని తమ ఆపరేషన్ చేస్తూ వచ్చారు నేరస్తులు. వేరే బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసి…అందులో కొంత డబ్బులు జమ చేసి …విత్ డ్రా చేసుకునేందుకు SBI ATM మిషన్లను వాడుకున్నారు. డబ్బును డిపాజిట్ మెషిన్లో జమ చేయడానికి, విత్ డ్రా చేయడానికి ఒకే బాక్స్‌లో ఫెసిలిటీ ఉంటుంది. ఇదే కేటుగాళ్ళకు అదునుగా మారింది. వీళ్ల టెక్నిక్ ఏమిటంటే..విత్ డ్రా మనీ సెలక్ట్ చేసి..డబ్బులు క్యాష్ ట్రేలోంచి బయటకు వస్తుండగా వాటిని పట్టుకొని…ATM మిషన్ స్విచ్ ఆఫ్ చేయడం. అక్కడ డబ్బులు నొక్కేస్తారు. అంతేగాక ఎక్కువ సేపు బాక్స్ డోర్ ఆగిపోవడంతో… ఎర్రర్ అని వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. డబ్బు విత్ డ్రా టైమ్‌లో కరెంట్ పోయిందని నగదు తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేసి మళ్లీ డబ్బులు కాజేయడం పనిగా పెట్టుకున్నారు.