‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతులు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నారు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేంది. నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే.’