రాజకీయ అరంగేట్రానికి ముందే స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా మంచి గుర్తింపు సాధించారు. కొన్ని సినిమాల్లోనూ నటిగా మెప్పించారు. 2014లో నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకున్న ఆమె.. అందరి చూపు తన వైపునకు తిప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని మట్టికరిపించి తన క్రేజ్‌ను మరింతపెంచుకున్నారు. బీజేపీలో కీలక మహిళా నాయకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం మోడీ కేబినెట్లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆమె..రచయిత్రిగా కొత్త అవతారమెత్తనున్నారు. ఆమె రచించిన తొలి నవల ‘లాల్ సలాం’ (Lal Salaam) ఈ నెల 29న మార్కెట్లో విడుదలకానుంది. 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. తన పుస్తకంతో దేశం కోసం దశాబ్దాలుగా సేవ చేసి.. ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు స్మృతి ఘనమైన నివాళులర్పించనున్నారు. వెస్ట్‌లాండ్ పబ్లిషింగ్ సంస్థ స్మృతి రచించిన పుస్తకాన్ని దేశ వ్యాప్తంగా పుస్తక ప్రియులకు అందుబాటులోకి తీసుకురానుంది.