Khammam MLC: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటుకు ఆరుగురు టీఆర్ఎస్ నాయకులు పోటీ పడడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశావహులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సీటు దక్కించుకోవడం కోసం అధినేత కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. మరోవైపు అవకాశం కోసం టీఆర్ఎస్ అగ్రనేతలు నిరీక్షిస్తుండగా.. ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పట్టుపడుతుండటంతో సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్న ఎమ్మెల్సీ టిక్కెట్ పోరు. సీఎం కేసీఆర్ మదిలో ఉన్న నేత ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక టికెట్ దక్కించుకునేందుకై అగ్ర నేతలందరూ హైదరాబాద్‌లోనే మకాం వేశారు.