ప్రభుత్వ రంగం సంస్థల ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై భారాలు పెరగనున్నాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 280వ రోజుకు చేరాయి. గురువారం నాటి దీక్షల్లో కర్మాగారం నుంచి ఇన్ట్రుమెంటేషన్, క్యుఎటిడి, డిఎన్డబ్ల్యూ, ఆర్ఎండ్డి, డిఎండ్ఇ, హెచ్ఆర్డి విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు ఎన్.రామారావు, డి.ఆదినారాయణ, గంధం వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 6 ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్ముతామని బాహాటంగా చెబుతుందన్నారు. అందులో పెట్రోలియం ఉత్పత్తుల పరిశ్రమలు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల ధరలను ప్రైవేటు వారు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని, ప్రైవేటీకరణ జరిగితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టిన వంటా-వార్పు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్మిక వర్గం వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దీక్షా శిబిరంలో ఆయా విభాగాల నాయకులు నరేష్ కుమార్, కెఎస్.రామచంద్రరావు, యేల్లేటి శ్రీనివాసరావు, పివి నాగేశ్వరరావు, తవిటయ్య, చీకటి శ్రీనివాస్, వైవి రమణ, శివ ప్రకాష్, గుప్తా, సురేష్, అప్పారావు, కోటేష్ నాయక్ పాల్గొన్నారు.