హుకుంపేట రాళ్ల గెడ్డలో మునిగి ఒక విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ కెపి.నాయుడు కథనం ప్రకారం… హుకుంపేట ప్రభుత్వ హైస్కూల్లో మర్రి మహేష్ (15) 9వ తరగతి, బురిడీ రమేష్ (12) 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు బట్టలు ఉతికేందుకు రాళ్లగెడ్డకు వెళ్లారు. అనంతరం స్నానానికి దిగి మునిగిపోయారు. వెంటనే ఒడ్డుపై ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో చేపలు పడుతున్న గ్రామస్తులు వచ్చి బురిడీ రమేష్‌ను వెలికితీశారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మర్రి మహేష్ కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లేకపోవడంతో పాడేరు పవర్ ఆఫీసు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. సాయంత్రం 4.30 గంటలకు మహేష్ మృతదేహం లభ్యమైంది. మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారమందించి పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.