రాష్ట్ర స్థాయిలో ఏకలవ్య క్రీడా పాఠశాలలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నేషనల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ అఫైర్స్‌ కమిషనర్‌ అసిత్‌ గోపాల్‌ అన్నారు. ఆదివారం అరకులోయను సందర్శించిన ఆయన ఎండపల్లివలస గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఏకలవ్య ఇఎంఆర్‌ఎస్‌ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దారి పొడవునా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అసిత్‌ గోపాల్‌ మాట్లాడుతూ దేశంలో 750 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటిలో వెనుకబడిన తరగతుల పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంచి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు. నాణ్యమైన ఉచిత విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కొత్త భవనాల కోసం రూ.20 కోట్ల నుంచి 48 కోట్ల వరకూ నిధులు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రాష్ట్రంలో ఏకలవ్య పాఠశాలకు అనుబంధంగా ప్రత్యేకంగా ఏకలవ్య స్పోర్ట్స్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.