ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. దానిపై వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు. అయితే, అందరి అనుమానాలను, అపోహలు తీర్చేలా, న్యాయ, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేలా మెరుగైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఇప్పుడున్న బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గత బిల్లులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని, బిల్లులోని సదుద్దేశాన్ని అందరికీ వివరిస్తామన్నారు. చట్ట, న్యాయపరంగా అన్నింటికీ సమాధానం ఇచ్చేలా బిల్లులో మార్పులు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు, అందరికీ దాన్ని వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయడానికి సిద్ధమేనన్నారు సీఎం జగన్. అందుకే గత బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.