అందరి ఊహలూ పటాపంచలైనాయి.. విశాఖలో అంతటా ఒక్కటే చర్చ.. ఒక్క అడుగు ప్రభుత్వం వెనక్కి వేసిందంటే, భవిష్యత్‌లో ఎలా వెళ్లబోతుంది..? రాజధానుల అంశానికి ఎలాంటి ముగింపును ఇవ్వబోతున్నారు… అనేదే సోమవారం పలుచోట్ల చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులపై అసెంబ్లీలో సోమవారం అకస్మాత్తుగా చేసిన ప్రకటనతో విశాఖ వాసులు ఒక్కసారిగా ఉత్కంఠకు గురయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో రియల్‌ వ్యాపారాలు, నిర్మాణ రంగం కాస్త ముందుకెళ్లిందనే చెప్పాలి. ప్రస్తుతానికి కూడా దీనికేమీ ఢోకా లేదన్నది క్రెడారు ప్రతినిధులు చెబుతున్నారు. అయితే తాత్కాలికంగా 3 రాజధానులపై బిల్లును ఉపసంహరించుకోవడంతో కొంత మేర ఈ ప్రాంతంలో నిరాశ కలిగే ఉండొచ్చు. రాజధాని ప్రకటన సందర్భంగానూ ఎలాంటి సంబరాలు జనంలో లేవు. ఉపసంహరించుకున్నాక కూడా అలాంటి వాతావరణం లేదు. అయితే ఒకరకమైన నిశ్శబ్దవాతావరణం విశాఖలో అలముకుంది. తదుపరి ఏం జరుగబోతుందో… ఒక్కసారిగా జగన్‌ చేసిన ప్రకటనతో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయని, ఎలా ముగియనుందోనంటూ చర్చలు సాగుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర, రాష్ట్రస్థాయిలో న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు లేకపోలేదన్నది సర్వత్రా మరో కోణంలో చర్చసాగుతోంది. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల్లో మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా నోరు విప్పని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కదా? అంటూ దాటవేస్తున్నారు. కొంతమంది వైసిపి శ్రేణులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడే ఆట మొదలైందని, త్వరలోనే ప్రభుత్వం రాజధానిపై సరైన ప్రకటన చేస్తుందంటూ చెప్పడం విశేషం.

By admin

Leave a Reply

Your email address will not be published.