శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.