మండల కేంద్రంలోని కస్తూర్భాయి గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి)లో సోమవారం రాత్రి 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో భోజనం తిని పైపులోని నీటిని తాగిన కొద్దిసేపటికే విద్యార్థినులు కడుపునొప్పితో విలవిలలాడారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన వారిని 108 వాహనంతో పాటు ప్రైవేటు ఆటోల్లో హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అన్నం తిని నీళ్లు తాగిన వెంటనే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థినులు చెబుతున్నారు. కెజిబివి విద్యార్థినుల అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటిడిఎ పిఒ ఆర్‌.గోపాలకృష్ణ స్పందించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. వైద్య నిపుణులు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఇతర వైద్య సిబ్బంది వారికి వైద్య సేవలు అందించారు. ఏ ఒక్కరికి కూడా ప్రాణపాయం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎం.మణికుమారి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రభు, వరహాలుబాబు, సిఐటియు నాయకులు ఎల్‌.సుందరరావు, టిడిపి సర్పంచులు పాండురంగస్వామి, సత్యనారాయణ, గిరిజన సమాఖ్య నాయకులు రాధాకష్ణ తదితరులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. కలుషిత నీటి వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సమాఖ్య నాయకులు చెబుతున్నారు. పాఠశాలలో నాచు కట్టిన కలుషిత నీటిని తాగడం, ఆ నీటితో వండిన ఆహారం తినడం వల్లే విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారని వారు విమర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.