అసెంబ్లీలో సభాపతి సభను నిర్వహించే తీరు బాగోలేదని, ప్రతి పక్షాన్ని ఇబ్బంది పెట్టడం, సీనియర్‌ ఎమ్మెల్యే మాట్లాడదామని అడిగితే మైక్‌ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బూతులు మంత్రి కొడాలి నాని, బూతుల ఎమ్మెల్యే జోగి రమేష్‌ అని ఆరోపించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మరిచి అటువంటి వారిపై అసభ్యంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. బాబయ్యని పొడిచి చంపి, సహజ మరణం అని వారి ఛానల్లో చూపించారని ఆరోపించారు. ఎయిడెడ్‌ కాలేజీలను రద్దు చేయడం, మిషనరీ స్కూల్‌ నుంచి భూములు లాక్కోవడం వంటి పనులు దారుణమన్నారు. మద్యం పేరుతో లీటర్‌ సారా రూ.వందకు అమ్ముతున్నారని, ఇసుక మాఫియా బినామీ కంపెనీతో నడుపుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టిడిపి విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.