కలెక్టరేట్ : విమానాశ్రయ పర్యావరణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.మల్లికార్టున అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో నిర్వహించిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్ఎస్ డేగ, విమానాశ్రయం, పోర్టు, జివిఎంసి, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలని, మాంస దుకాణాలు తొలగించాలని, పారిశుధ్యపనులు చేపట్టాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా తగిన నిర్మాణాలు, పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం లోనికి పందులు, కుక్కలు చొరబడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విమానాశ్రయ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎజిఎం స్టాలిన్ కుమార్, ఐఎన్ఎస్ డేగ అధికారి శశాంక్ గుప్తా, ఆర్డీవో కె.పెంచలకిషోర్, జివిఎంసి వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి, ఇఇ రత్నరాజు, ఇరిగేషన్ ఎస్ఇ కెఎస్.కుమార్, పాల్గొన్నారు.