కలెక్టరేట్ : నగరంలో ఈ నెల 10న నిర్వహించే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల నియమ నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా నిర్వహించాలన్నారు. నగరంలో 32 కేంద్రాలలో నిర్వహించే పరీక్షలకు 12,166 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 5 నిమిషాలు ముందు మాత్రమే ప్రశ్నపత్రాలు తెరవాలన్నారు. పరీక్షలకు సెల్ ఫోన్లు, గాడ్జెట్స్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్డిసి రంగయ్య, జడ్పీ సిఇఒ నాగార్జునసాగర్, జివిఎంసి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రి పాల్గొన్నారు.