బెంగళూరు లక్ష్యం 142 పరుగులే. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా పుంజుకుని 14 ఓవర్లకు 92/3తో మెరుగైన స్థితిలోనే నిలిచిందా జట్టు. పడిక్కల్‌, మ్యాక్స్‌వెల్‌ నిలకడగా ఆడుతున్నారు. ఇంకా డివిలియర్స్‌ ఆడాల్సి ఉంది. 6 ఓవర్లలో 50 పరుగులు ఏమంత కష్టం కాదనే అనుకున్నారు ఆర్‌సీబీ అభిమానులు. కానీ ప్లేఆఫ్స్‌ రేసులో లేకపోయినా.. పట్టుదల ప్రదర్శించిన సన్‌రైజర్స్‌ ఆర్‌సీబీకి కళ్లెం వేసింది. కీలకమైన వికెట్లు పడగొట్టి, పరుగులు కట్టడి చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఏబీ క్రీజులో ఉన్నా ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో కోహ్లీసేన టాప్‌-2 ఆశలకు తెరపడ్డట్లే.

ఐ పీఎల్‌ లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిస్తే.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌ ఓడినా.. ఇంకో అవకాశం ఉంటుంది. అందుకే ఆర్‌సీబీ ఆ స్థానం కోసం గట్టి ప్రయత్నమే చేసింది కానీ.. దానికిక అవకాశం లేనట్లే. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరిన ఆ జట్టు.. గురువారం సన్‌రైజర్స్‌ను ఓడించి తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంది. కానీ హైదరాబాద్‌ అవకాశమివ్వలేదు.ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. జేసన్‌ (44; 38 బంతుల్లో 5×4), విలియమ్సన్‌ (31; 29 బంతుల్లో 4×4) రాణించారు. హర్షల్‌ పటేల్‌ (3/33), క్రిస్టియన్‌ (2/14) ఆ జట్టును కట్టడి చేశారు. అనంతరం సన్‌రైజర్స్‌ బౌలర్లందరూ సమష్టిగా సత్తా చాటి.. బెంగళూరును 137/6కు పరిమితం చేశారు. మ్యాక్స్‌వెల్‌ (40; 25 బంతుల్లో 3×4, 2×6), పడిక్కల్‌ (41; 52 బంతుల్లో 4×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. చివరి మ్యాచ్‌లో గెలిచినా రన్‌రేట్‌లో చెన్నైని దాటడం కష్టమే కాబట్టి ఆర్‌సీబీ టాప్‌-2లోకి వెళ్లడం కష్టమే.

By admin

Leave a Reply

Your email address will not be published.