కాకినాడ: డ్రగ్స్‌ రవాణాపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని.. త్వరలోనే వాస్తవాలు బయట పడతాయని వైకాపా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాలకు వ్యాపారం కోసం వెళ్తారు కానీ.. డ్రగ్స్‌ దందా చేసేందుకు కాదని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు భయపడేది లేదని, తెదేపా నేతల అరుపులను లెక్కచేయనని తేల్చి చెప్పారు.

”పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతోందని ఒక కట్టుకథ అల్లారు. అందులో నన్న, మరో ఇద్దరు ప్రముఖ వ్యాపారులను తీసుకొచ్చి లింకు పెట్టారు. సీఎం జగన్‌ను విమర్శించే అవకాశం తెదేపా నేతలకు ఎక్కడా దొరకడం లేదు. కావాలంటే ప్రజల్లోకి వెళ్లి మాట్లాడండి. అది చేయలేక ఒక కట్టుకథను తెరపైకి తీసుకొచ్చారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ దొరికితే పోలీసులు, దర్యాప్తు సంస్థలు చూస్తూ ఊరుకుంటాయా? డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటాం. ఇవాళ ఎంతో మంది అలా చేస్తున్నారు. దీనిలో తప్పు పట్టేందుకు ఏముంది?అక్కడికి ఎందుకెళ్లారు.. ఇక్కడికి ఎందుకెళ్లారు.. అని అనవసర ప్రశ్నలు అడుగుతున్నారు. ఇదే నా చివరి సమాధానం. ఇలాంటి వాటికి మరోసారి నేను సమాధానం చెప్పను. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. సరైన రీతిలో సమాధానం చెబుతా” అని ద్వారంపూడి హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.