జిల్లాలో గురువారం రెండు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ మాధవి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సిరిపురం : రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు అన్ని రకాల సేవలనూ అందుబాటులోకి తీసుకురావాలన్నదే సిఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఛాతి ఆసుపత్రిలో పిఎం కేర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానిక ఆసుపత్రిలో ఉన్న 300 బెడ్స్కు గానూ 100 బెడ్స్కు నిరంతరం ఆక్సిజన్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, విఎంఆర్డిఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల పాల్గొన్నారు.
