ఇక ఉత్కంఠేమీ లేదు. లీగ్ దశ ఆఖరి రోజు ఫలితాలతో సంబంధం లేదు. ప్లేఆఫ్స్ చేరే నాలుగో జట్టేదో తేలిపోయింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా అదిరే ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో రాజస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ.. దిల్లీ, చెన్నై, బెంగళూరు తర్వాత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ సమరానికి సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ చక్కని ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరు సాధించిన కోల్‌కతా.. శివమ్ మావి, ఫెర్గూసన్‌ల సూపర్ బౌలింగ్‌తో రాయల్స్‌ను కుప్పకూల్చింది. ఈ ఫలితంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కథ ముగిసింది. ఇక శుక్రవారం జరిగే రెండు మ్యాచ్‌లు నామమాత్రమే. ముంబయి సాంకేతికంగా రేసులో ఉన్నా.. ముందంజ వేయడం అసాధ్యం. ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో కోల్‌కతాతో సమమవుతుంది. కానీ కోల్‌కతాకు చాలా మెరుగైన రన్‌రేట్ ఉంది. రన్‌రేట్‌లో ఆ జట్టును అధిగమించాలంటే ముంబయి చివరి మ్యాచ్‌లో 171 పరుగుల తేడాతో నెగ్గాలి. అది సాధ్యమయ్యే పని కాదు.
షార్జా
కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కుమ్మేసింది. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు.. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ (56; 44 బంతుల్లో 4×4, 2×6), వెంకటేశ్ అయ్యర్ (38; 35 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో మొదట కోల్‌కతా 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఛేదనలో చతికిలపడ్డ రాజస్థాన్ త్వరగానే చేతులెత్తేసింది. శివమ్ మావి (4/21), ఫెర్గూసన్ (3/18), వరుణ్ చక్రవర్తి (1/14) ధాటికి 16.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. తెవాతియా (44) బ్యాట్ ఝుళిపించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కోల్‌కతా బౌలింగ్ దాడిని ఆరంభించిన షకిబ్.. మూడో బంతికే జైశ్వాల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. పతనం ఏ దశలోనూ ఆగలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. ఫెర్గూసన్, శివమ్ మావి రాజస్థాన్ పతనాన్ని శాసించారు. 8 ఓవర్లలో 34/6తో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది. తెవాతియా మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయంతే.