రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుల విషయంలో కేంద్రం బాటనే పయనిస్తోంది. ఆధార్‌ కార్డును లింకు చేసి దేశ వ్యాప్తంగా 4.40కోట్ల కార్డులను ఏరివేసే కుట్రకు కేంద్రం దిగింది. రాష్ట్రంలో కూడా అనర్హుల పేర సర్వేకు సర్కారు దిగింది. విశాఖలో 55 వేల పైచిలుకు కార్డులను ప్రభుత్వం ఇప్పటికే ఏరివేసింది. కొత్త కార్డులు వస్తాయి… ఇస్తామనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తూనే ఉన్నవాటికి ఎసరు పెట్టేసిందంటూ ప్రతిపక్షల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లలో రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉన్నాయి. రేషన్‌ అనేది ఆర్థిక ఆసరాకు చిహ్నంగా వెలుగొందుతూ అనేక మంది అన్నార్తులకు, దిగువ మధ్యతరగతి ప్రజలకూ బాసటగా నిలుస్తోంది. అర్హత లేకున్నా తప్పుడు మార్గాల ద్వారా రేషన్‌ కార్డులు పొంది ప్రభుత్వ పథకాలు పొందుతున్నారనే కారణంతో ప్రభుత్వం వీటిలో చాలావరకూ రద్దు చేసే యోచనలో పడింది. విశాఖ జిల్లాలో సుమారు 12 లక్షల వరకూ తెల్లరేషన్‌ కార్డులున్నట్లు సమాచారం. వీటిలో 3 నుంచి 4 లక్షల కార్డులను ఏరివేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. అనర్హులు ప్రయోజనాలు పొందడానికి వీల్లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్నాళ్ల పాటు ఒక సౌకర్యాన్ని అనుభవించిన ప్రజల నుంచి వెనక్కి లాగేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం పట్ల అన్ని తరగతుల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.