లక్నో: తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చిన ఆయన శుక్రవారం లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి పోలీసులు గురువారం సమన్లు ఇచ్చారని, అయితే ఆరోగ్య కారణాల వల్ల పోలీసుల ఎదుట కు శుక్రవారం రిపోర్ట్‌ చేయలేకపోయినట్లు అజయ్‌ మిశ్రా చెప్పారు. తన కుమారుడు పోలీసులకు శనివారం రిపోర్ట్‌ చేస్తాడని ఆయన అన్నారు.

తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తాడని కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా మీడియాకు తెలిపారు. ప్రతిపక్షం ప్రతి అంశంపై తన రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. దర్యాప్తు మొదలైతే అసలు విషయాలు బయటకు వస్తాయని అన్నారు. నిజమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, లఖింపూర్‌ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి వాహనాన్ని దూకించి రైతులను తొక్కించి హత్య చేసినట్లు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై రైతు సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మొత్తం 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌, ముగ్గురు ఇతరులు ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.